కంపాలా: ఉగాండా ఆర్మీ చీఫ్‌ జనరల్ ముహూజీ కైనెరుగాబా, టర్కీకి రెండు డిమాండ్లు చేశారు. సోమాలియాలోని ఇస్లామిక్ మిలిటెంట్లతో పోరాటానికి ఉగాండా అందించిన దీర్ఘకాలిక సైనిక సేవలకు గాను బిలియన్ డాలర్లు చెల్లించాలని కోరారు. అలాగే టర్కీలోని అందమైన అమ్మాయి తనకు భార్యగా కావాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్ల కోసం టర్కీకి నెల రోజులు గడువు ఇచ్చారు. వాటిని నెరవేర్చకపోతే ఉగాండా రాజధాని కంపాలాలోని టర్కీ రాయబార కార్యాలయాన్ని మూసివేయడంతో సహా తీవ్రమైన దౌత్యపరమైన పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.

ఉగాండా ప్రయాణం

కాగా, ఉగాండాను టర్కీ వెన్నుపోటు పోడిచిందని ఆ దేశ ఆర్మీ చీఫ్‌ ముహూజీ కైనెరుగాబా ఆరోపించారు. అలాగే ఇజ్రాయెల్‌కు తన మద్దతును ఆయన ప్రకటించారు. ‘మన దేవుడైన యేసు క్రీస్తు పవిత్ర భూమిని రక్షించడానికి, నా ఆధ్వర్యంలో లక్ష మంది ఉగాండా సైనికులను ఇజ్రాయెల్‌కు పంపడానికి నేను సిద్ధంగా ఉన్నా’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. శనివారం ఈ మేరకు పలు ట్వీట్లు చేశారు.

మరోవైపు, ఉగాండా ఆర్మీ చీఫ్‌ జనరల్ ముహూజీ కైనెరుగాబా పెళ్లి కోసం వింత కోరికలు కోరడం ఇదే తొలిసారి కాదు. 2022లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనిని వివాహం చేసుకుంటానని ఆయన ప్రతిపాదించారు. బదులుగా ఆ దేశానికి 100 ఆవులను ఆయన ఆఫర్ చేశారు.