
…. భీమ్‌గల్ అభివృద్ధిపై కాంగ్రెస్ నేతల నిర్లక్ష్యం
… 100 పడకల ఆసుపత్రిపై పీసీసీ మూడు నెలల హామీ ఏమైంది ?
… రెండున్నర ఏండ్లయినా పూర్తికాని మిగిలిన ఆసుపత్రి పనులు
… ఇంటిగ్రేటెడ్ మార్కెట్, బస్ డిపోలపై అదే నిర్లక్ష్యం
… బడా భీమ్‌గల్ బ్రిడ్జి కొట్టుకుపోయి ఏడాది దాటినా మరమ్మత్తులు ఏవీ?
… నెల రోజుల్లో మిగిలిన పనులు పూర్తి చేయకుంటే పోరాటమే
…. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
( భీమ్‌గల్ – వారధి ): బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరై చేపట్టిన పనులు భీంగల్ అర్ధాంతరంగా నిలిచిపోయాయని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. తమ హయాంలో 75 శాతం పనులు పూర్తి కాగా, మిగిలిన 25 శాతం పనులు కూడా పూర్తి చేయలేని అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడ్డారు. భీమ్‌గల్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో కలిసి ఆదివారం రోజు ప్రశాంత్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిధులు మంజూరై, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్లు దాటినా పనులు చేయకుండా ఆగిపోయిన 100 పడకల హాస్పిటల్, ఇంటిగ్రెటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ పనులు, మున్సిపల్ ఎలక్షన్ ల ముందర ఓట్లకోసం కాంగ్రెస్ ప్రభుత్వం భీంగల్ మున్సిపాలిటీ లో కంకర పోసి వదిలేసిన రోడ్లను, బస్ డిపోను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం భీంగల్ లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని, కాంగ్రెస్ నాయకుల అబద్ధపు హామీలను ఆయన తీవ్రస్థాయిలో ఎండగట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావులను ఒప్పించి రూ. 35 కోట్లతో 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేయించానని ఎమ్మెల్యే వేముల గుర్తుచేశారు. ఇందులో రూ. 22 కోట్లు బిల్డింగ్ నిర్మాణానికి, రూ. 5 కోట్లు వైద్య పరికరాల కొనుగోలుకు, రూ. 8 కోట్లు పన్నుల నిమిత్తం కేటాయించడం జరిగిందన్నారు. కేవలం ఏడాది కాలంలోనే తాము అధికారంలో ఉండగా రం16 కోట్లతో 75 శాతం బిల్డింగ్ పనులను పూర్తి చేసి, కాంట్రాక్టర్‌కు రూ. 13 కోట్ల బిల్లులు కూడా ఇప్పించామని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భీమ్‌గల్ ప్రజలను మభ్యపెడుతూ… తమను గెలిపిస్తే మూడు నెలల్లో రూ. 5 కోట్లు ఇప్పించి ఆసుపత్రిని తెరిపిస్తామని అబద్ధపు హామీలు ఇచ్చారని ధ్వజమెత్తారు. ఫిబ్రవరి 14న ఎన్నికల ఫలితాలు వచ్చి ఇప్పటికే నాలుగు నెలలు గడిచినా మిగిలిన 25 శాతం పనులను పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాగే మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట తప్పారని విమర్శించారు. ఇప్పటికైనా వంద పడకల ఆసుపత్రిని పూర్తి చేయడానికి జూలై 14 వరకు మరో నెల రోజులు గడువు ఇస్తున్నామని, ఆలోగా ఆసుపత్రిని ప్రారంభించకుంటే భీంగల్ లో మహేష్ కుమార్ గౌడ్‌ను, కాంగ్రెస్ నాయకులను ప్రజలు తిరగనివ్వరని నిలాదీస్తారని, అడ్డుకుంటారని హెచ్చరించారు. భీమ్‌గల్ పట్టణంలో పాత తహసీల్దార్ ఆఫీస్ స్థలంలో రూ.3 కోట్లతో 108 దుకాణాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని గత బిఆర్ఎస్ ప్రభుత్వంలోనే ప్రారంభించామని, తమ హయాంలోనే రూ. 2 కోట్ల పనులు పూర్తయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. మున్సిపాలిటీకి శాశ్వత ఆదాయం వచ్చేలా అదే ప్రాంగణంలో మెయిన్ రోడ్డుపై మరో రూ. 3 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి, మొత్తంగా రూ. 7 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు రావాల్సిన రూ. 90 లక్షల బిల్లులు చెల్లించకపోవడంతో రెండున్నర సంవత్సరాలుగా పనులు పూర్తిగా నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో రూ. 2.10 కోట్లతో మూతపడ్డ భీమ్‌గల్ బస్ డిపోను ఆధునీకరించి, తాము అధికారంలో ఉన్నప్పుడు ఆరు నెలల పాటు విజయవంతంగా నడిపించామని ఎమ్మెల్యే తెలిపారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో బస్ డిపోను పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు, నేటికి ఆ ఊసే ఎత్తడం లేదని వేముల మండిపడ్డారు. గత ప్రభుత్వంలో తాము భీమ్‌గల్ మున్సిపాలిటీ పరిధిలో మిగిలిపోయిన సీసీ రోడ్ల కోసం రూ. 10 కోట్లు, ఫంక్షన్ హాల్ కోసం రూ. 1.5 కోట్లు.. మొత్తంగా రూ. 11.5 కోట్లు మంజూరు చేయించామని వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో మంత్రి సీతక్క చేత హడావుడిగా కొబ్బరికాయలు కొట్టించి, కంకర పోయించిన కాంగ్రెస్ నాయకులు, ఆరు నెలలవుతున్నా ఆ రోడ్లను పూర్తి చేయలేదని దుయ్యబట్టారు. బడా భీమ్‌గల్ బ్రిడ్జి, రోడ్డు వరదలకు కొట్టుకుపోయి ఏడాది దాటుతున్నా కనీస మరమ్మతులు చేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు అద్దం పడుతోందన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు మంజూరు చేసిన బడ్జెట్ నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ..మిగిలిన 25 శాతం పనులను కుడా పూర్తి చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఓడినా గెలిచినా బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షానే ఉంటుంది, ప్రజల కోసమే పోరాడుతుందని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.జూలై 14 లోగా 100 పడకల ఆసుపత్రి పనులను పూర్తి చేసి ప్రారంభించాలి. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పెండింగ్ బిల్లులు చెల్లించి పనులను నెలరోజుల్లోగా పునఃప్రారంభించాలి.భీమ్‌గల్ బస్ డిపోలో బస్సుల కేటాయింపు, కంట్రోలర్ వ్యవస్థను ఏర్పాటు చేసి నెలరోజుల్లోగా యథా విధంగా పూర్తి స్థాయిలో నడపాలని డిమాండ్ చేసారు. 11.50 కోట్లతో తాము మంజూరు చేసిన అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్లు మరియు డ్రైనేజి పనులను నెలరోజుల్లోగా పూర్తి చేయాలి.బడా భీమ్‌గల్ బ్రిడ్జి మరమ్మతు పనులను నెల రోజుల్లోగా పూర్తి చేయాలి. ఈ డిమాండ్లను నెల రోజుల్లోగా పరిష్కరించకుంటే, భీమ్‌గల్ పట్టణ మరియు మండల ప్రజల పక్షాన బీఆర్ఎస్ శ్రేణులను, ప్రజాసంఘాలను కలుపుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉధృతమైన నిరసన కార్యక్రమాలు, ప్రజాపోరాటాలు చేపడతామని, ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను నిలదీస్తామని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.

