హర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ తన వైఖరిని కొన్ని గంటల్లోనే మార్చుకుంది. హర్మూజ్ జలసంధిని వాణిజ్య నౌకల రాకపోకలకు తెరిచి ఉంచనున్నట్టుగా ఇరాన్ శుక్రవారం ప్రకటించింది. అయితే కొన్ని గంటల్లోనే హర్మూజ్‌ను మూసివేస్తున్నట్టుగా తెలిపింది. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం అమల్లో ఉన్నంత కాలం… హర్మూజ్ జలసంధి గుండా రవాణాను అడ్డుకుంటామని ఇరాన్ సంయుక్త మిలటరీ కమాండ్ హెచ్చరించారు. అయితే ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్భంధనం తొలగించాలని ఇరాన్ ఇప్పటికే డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
‘‘హర్మూజ్ జలసంధిపై మా నియంత్రణ మునుపటి స్థితికి చేరుకుంది. ప్రస్తుతం మా సాయుధ దళాల కఠినమైన నియంత్రణలో ఉంది. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం అమల్లో ఉన్నంతకాలం.. జలసంధి మార్గంలో రాకపోకలను అడ్డుకుంటాం’’ అని ఇరాన్ సంయుక్త మిలటరీ కమాండ్ హెచ్చరించింది.
మరోవైపు ట్రంప్ మాత్రం… ఇరాన్‌తో ఒప్పందం కుదిరేవరకు ఆ దేశ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం పూర్తి స్థాయిలో కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. హర్మూజ్ జలసంధిని రవాణాకు అనుమతిస్తూ ఇరాన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించినప్పటికీ… ఇరాన్‌తో ఒప్పందం కుదిరేవరకు తమ దిగ్భంధనం ఉంటుందని ట్రంప్ చెప్పుకొచ్చారు.
అయితే ప్రపంచ చమురు రవాణాలకు హర్మూజ్ జలసంధి కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే.ప్రపంచ చమురు వాణిజ్యంలో 20 నుంచి 25 శాతం హర్మూజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. అయితే గత 50 రోజులుగా మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న పరిస్థితులతో ఇరాన్ తమ నియంత్రలోని హర్మూజ్ జలసంధి ద్వారా నౌకల రవాణాపై ఆంక్షలు విధఇంచింది. దీంతో ఈ ప్రభావం ప్రపంచంలోని అనేక దేశాలపై పడింది. అయితే శుక్రవారం రోజున ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. హర్మూజ్ జలసంధిని నౌకల రవాణాకు అనుమతిస్తున్నట్టుగా పేర్కొంది. ఈ క్రమంలో క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. కానీ కొన్ని గంటల్లోనే హర్మూజ్ జలసంధిపై మునుపటి స్థితి కొనసాగుతుందని ఇరాన్ ప్రకటన చేసింది.
రెండో విడత చర్చల దిశగా అడుగులు…
అమెరికా, ఇరాన్‌ల మధ్య రెండో విడత చర్చల దిశగా అడుగులు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇరాన్, అమెరికాల మధ్య రెండో విడత చర్చలకు డేట్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. ఇరాన్, అమెరికా ప్రతినిధుల మధ్య మరో విడత చర్చలు సోమవారం పాకిస్థాన్‌లో జరుగుతాయని ఇరాన్ అధికారి ఒకరు సీఎన్ఎన్కు తెలిపారు. అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాలు ఈ వీకెండ్లో పాకిస్థాన్‌కు చేరుకుని… సోమవారం చర్చలు జరుపుతాయని ఇరాన్ వర్గాలు తెలిపాయని సీఎన్ఎన్ రిపోర్టు చేసింది. అయితే అదే సమయంలో చర్చల తేదీ ఖరారైందని అమెరికా ఇంకా ధృవీకరించలేదు. అయితే ఇరాన్ హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేయడంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వాగతించిన సంగతి తెలిసిందే. హర్మూజ్ జలసంధిని తెరిచినందుకు ఇరాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
అయితే ఇప్పటికే అమెరికా, ఇరాన్‌ల మధ్య రెండో విడత చర్చలు త్వరలోనే జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించిన సంగతి తెలిసిందే. అలాగే, ఈ చర్చలలో యుద్దం ముగించడానికి ఒప్పందం కుదిరితే, సంతకం చేసేందుకు తాను పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు వెళ్లే అవకాశం ఉండొచ్చని కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. ఏప్రిల్ 22న ముగియనున్న అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణను తాను పొడిగించగలనని… కానీ అలా చేయవలసిన అవసరం రాకపోవచ్చని ఆయన అన్నారు.
